కవాడిగూడ, ఆగస్టు 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కావాలి తప్పితే రాజకీయ పార్టీల భిక్ష అవసరం లేదని తేల్చిచెప్పారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గజ్జసత్యం, కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేశ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సోమవారం నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆర్ కృష్ణయ్య దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు, రాజారామ్‌యాదవ్, నవీన్‌చారి, నారగోని, బీ ఎస్ రాములు, లలితాయాదవ్ హాజరై మద్దతు పలికారు.
శాసన మండలి విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత అంటే సామాజిక న్యాయమని, దీన్ని సాధించే క్రమంలో బీఆర్ఎస్ బీసీ సమాజానికి తోడుంటుందని చెప్పారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేవరకూ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తప్పుడు విధానాలు విడనాడి చట్టబద్ధంగా రిజర్వేషన్ల అమలుకు కృషిచేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు, బీసీ సంఘం నాయకులు సీ రాజేందర్, జిల్లపల్లి అంజి, బర్కకృష్ణ, అనంతయ్య, గొరిగె మల్లేశ్, మోదీ రాందేవ్, అనురాధ, లతాసింగ్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.