ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 24: డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులతోనే నింపాలని కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనివారితో ఆయా ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అలా చేస్తే భూ సర్వేలో తప్పులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.