ముషీరాబాద్, ఫిబ్రవరి 15: తప్పుతడకగా సాగిన బీసీ జనగణనను పక్కదారి పట్టించేదుకే ప్రధాని నరేంద్రమోదీ కులం అంశాన్ని సీఎం రేవంత్ తెరపై తీసుకొచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. మోదీ బీసీ కాదనీ, కన్వర్టెడ్ బీసీ అని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. మోదీ కులంపై చేసిన వ్యాఖ్యలు దేశంలోని బీసీలకు కించపర్చడం, అవమానపర్చడమేనని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీ ప్రధానిగా గొప్పగా రాణిస్తుంటే అగ్రవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. దేశంలో బీసీలకు రక్షణ కల్పించేందుకు జాతీయ బీసీ కమిషన్‌కు మోదీ రాజ్యాంగబద్ధత కల్పించారని, విస్తృత అధికారాలు ఇచ్చారని చెప్పారు. రాష్ర్టంలో బీసీలు తీవ్ర నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నారని, రేవంత్ సర్కారు బీసీ జనగణన అసంబద్ధంగా చేసిందని మండిపడ్డారు. బీసీలపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 80 ప్రశ్నలతో కాకుండా 3 ప్రశ్నలతో ఇంటింటి రీసర్వే చేయించాలని స్పష్టంచేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్రం మీదకు తొసి ఊరుకుంటామంటే సహించేదిలేదని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంఘాల నేత కొండా దేవయ్య తదితరులు పాల్గొన్నారు.