హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు అనుమతుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ముఖం చాటేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులతో రెండురోజులపాటు జరిపిన వరుస చర్చలు సఫలం అయ్యాయని, రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని, మెట్రోపై కీలక అడుగు పడిందని, మెట్రో స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సీఎంవో కార్యాలయం చెప్తున్నది. అంతేతప్ప మీడియా ముందుకు వచ్చి ఎవరూ మాట్లాడటం లేదు.
ఢిల్లీలో నిజంగా జరిగింది ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎవరూ చెప్పడం లేదు. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది మొదలు, ఐఆర్ఎఫ్సీ రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు చేసేవరకు అడుగడుగునా సీఎం రేవంత్ మీడియా సమావేశాలు, చిట్చాట్లు పెట్టి ఢంకా బజాయించారు. ఇ ప్పుడు అంత పెద్ద విజయం సాధిస్తే.. ఎందుకు మీడియాకు ముఖం చాటేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘మీకు అంత ఫ్రస్టేషన్ ఎందు కు? ఎవరితోనూ మాట్లాడకుండా, నిర్వేదంలోకి ఎందుకు వెళ్లిపోయినట్టు?’ అని అడుగుతున్నారు. ఢిల్లీలో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల చర్చల్లో సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందు కు తీసుకెళ్లేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. ఇది అందరి ఏకాభిప్రాయంతోనే జరిగిందని చెప్తున్నారు. మొదటి దశ ఆస్తుల విలువను నిర్ధారించడం, రెండో దశ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తేల్చడం, ఈక్విటీ విలువ, రుణ సేకరణపై రోడ్ మ్యాప్ తయారు చేయడం ఈ సంస్థ బాధ్యత. అంతేకాదు.. మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 దశలకు అవసరమైన రుణాలను తకువ వడ్డీకి ఇచ్చే సంస్థలను అన్వేషించి, ఎంపిక చేసి, వాటితో సంప్రదింపులు జరిపి, రుణం మంజూరుకు మార్గం సుగమం చేస్తుంది.
రెండు దశలకు కలిపి రుణం తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఫేజ్-1 ఆస్తులు, అప్పుల విలువను మదింపు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడైనా తెలంగాణ సీఎం మాట చెల్లుబాటు అయినట్టు కనిపిస్తున్నదా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ అంశం లో రేవంత్ ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఫేజ్-1కు సంబంధించిన ఆస్తుల విలువను మదింపు చేయించామన్న మాట కూడా చెప్పలేకపోయారా? అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. రేవంత్ ప్రభుత్వానికి, ఎస్బీఐకి పడటం లేదన్నది బహిరంగ రహ స్యం. తెగదెంపులు చేసుకుంటామని, లీడ్ బ్యాంకు హోదాను రద్దు చేస్తామంటూ కత్తులు పట్టుకొని తిరిగారు. ‘ఢిల్లీలోనే సంగతి తేలుస్తామంటూ వెళ్లిన మీరు.. మళ్లీ ఎస్బీఐనే ఎందు కు భుజాల మీదికి ఎక్కించుకున్నట్టు? ఆ సంస్థ దయాదాక్షిణ్యాల మీదే మెట్రో రుణం ఆధారపడి ఉండటాన్ని ఎలా అంగీకరించా రు?’ అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం రేవంత్‌తో భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొంత సాఫ్ట్‌గానే మాట్లాడినట్టు తెలిసింది. కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం రెండు నిమిషాల్లోనే సీఎంను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. ‘మెట్రో ఏమైనా మీ సొంతం అనుకుంటున్నా రా? మీరు సీఎం కాకముందే హైదరాబాద్ మెట్రో ఉన్నది. అందులో కేంద్ర భాగస్వామ్యం ఉన్నది’ అని అన్నట్టు తెలిసిం ది. ఎస్బీఐతో మెట్రో ఆస్తులను మదింపు చే యించాలని కేంద్రం చేసిన సూచనలను మీరు ఎందుకు పక్కన పెట్టారు? వేరే ఏజెన్సీతో మదింపు చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? అని నిలదీసినట్టు తెలిసింది. ఫేజ్-1లో నష్టాలు వస్తున్నప్పుడు, ఫేజ్-2కు ఎలా వెళ్తున్నారని, రెండు దశల మధ్య సమగ్రత ఉన్నప్పుడే నిధులు వస్తాయనే విషయం తెలియకుండా నివేదిక రూపొందించారని మండిపడ్డట్టు తెలిసింది. ‘మీరు పంపిన నివేదిక తప్పుల తడక, మీరు పంపిన డీపీఆర్‌లు అసమగ్రం’ అని ఖట్టర్ ఒంటికాలు మీద లేచినట్టు ప్రచారం జరుగుతున్నది. కేంద్ర మంత్రి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం రేవంత్ సమాధానం చెప్పలేదని సమాచారం. సమావేశం చివర్లో ‘నేను ప్రధాని స్థాయిలో మాట్లాడుకుంటాను’ అని రేవంత్ అన్నట్టు తెలిసింది. మీరు ఎక్కడికి వెళ్లినా ఇదే సమాధానం ఉంటుందని ఖట్టర్ చెప్పినట్టు సమాచారం.
రూ.13,657 కోట్ల రుణానికి ఐఆర్ఎఫ్సీతో ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. రూ.1,400 కోట్ల ఈక్విటీ షేర్‌ను ఎల్ అండ్ టీ ఖాతాలో వేశామని , ఐడీబీఐ క్యాపిటల్‌కు బ్రోకరేజ్ ఫీజు కింద రూ.174 కోట్లు, ఐఆర్ఎఫ్సీకి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు పంపినట్టు వెల్లడించారు. కానీ ఆయా సంస్థలతో జరిగిన ఎంవోయూలు మాత్రం ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. ప్రజా రవాణాకు సంబంధించిన ఎంవోయూలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఐడీబీఐ క్యాపిటల్ సంస్థకు బ్రోకరేజ్ ఫీజు కింద ప్రభుత్వం రూ.174 కోట్లు చెల్లించింది. ఐఆర్ఎఫ్సీకి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు జమ చేసింది. మరి ఆ రూ.256 కోట్ల పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా రాబడతారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఐఆర్ఎఫ్సీతో రుణ ఒప్పందం, ఫేజ్-1 స్వాధీన ప్రక్రియ ముగిసిన తర్వాత మెట్రో ఆస్తులను ఎలా పంచుకోవాలో కాంగ్రెస్ నేతలు ప్లాన్ వేసుకున్నట్టు తెలిసింది. రాష్ర్టానికి చెందిన ఒక సీనియర్ మంత్రి మెట్రో స్థలంలో సెవెన్ స్టార్ హోటల్ పెట్టాలని అనుకున్నట్టు తెలిసింది. ఆయన దుబాయ్ వెళ్లి ఒక అంతర్జాతీయ చైన్ హోటల్స్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్టు సమాచారం. మెట్రో స్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఒక విలువైన స్థలంలో హోటల్ నిర్మాణానికి దుబాయ్ సంస్థ కూడా ఆసక్తి చూపినట్టు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్టుగా జాన్ 1వ తేదీన మెట్రో మొదటి దశ ప్రభుత్వం చేతికి వచ్చి ఉంటే, ఈ హోటలే ముందు నిర్మించేవారని ప్రచారం జరుగుతున్నది.