హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోనిది. అటవీశాఖ కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధీనంలోనిదే! అలాంటి హెచ్‌సీయూలో హరిత హననంపై కేంద్రం మౌనంగానే ఉండిపోయింది. 20 రోజులపాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల నిర్బంధకాండ, లాఠీచార్జీలు జరిగినా మోదీ సర్కారు నుంచి స్పందన లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అడవులను నరికేస్తున్నదంటూ హర్యానా పర్యటనలో ఒక్క మాటతోనే ప్రధాని సరిపెట్టారు. ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే సుమోటోగా కేసును విచారిస్తున్నా.. దాంట్లోనూ కేంద్రం ఇంప్లీడ్ కాలేదు.
ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నచోట చిన్నాచితకా అంశాలపైనా దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించడం మోదీ సర్కార్‌కు కొత్తేమీకాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బరాజ్‌లో ఒక్క పిల్లర్ కుంగిపోతే.. వెనువెంటనే విచారణ కోసం ఎన్డీఎస్ఏను రంగంలోకి దింపిం ది. ఈడీ, సీబీఐ, విజిలెన్స్.. ఇలా దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దాపరికమేమీ లేకుండా తన రాజకీయ ప్రత్యర్థుల మీదకు ప్రయోగించింది. మరి, 400 ఎకరాలను తాక ట్టు పెట్టి రూ.పదివేల కోట్లు సేకరించడంలో ఆర్థికమోసం జరిగినట్టు ఆధారాలున్నా కేం ద్రం నుంచి ఉలూకూ పలుకూ లేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నెన్నో విమర్శలు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ కానీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. చిన్నచిన్న కేసుల విషయంలోనూ ఆగమేఘాలపై ఊడిపడే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర ఏజెన్సీలు ఆర్థిక, పర్యావరణ అంశాలకు సంబంధించిన ఇంత పెద్ద వ్యవహారంపై దృష్టిసారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచ గచ్చిబౌలి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. భారత అటవీచట్టం-1927లోని నిబంధనలకు విరుద్ధంగా డీమ్డ్ ఫారెస్ట్ ల్యాండ్‌ను తనఖా పెట్టడం, టీజీఐఐసీకి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థకు ఈ భూమిని తాకట్టు పెట్టడం, తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు చేపట్టడం వంటి ఆరోపణలున్నాయి.
భూముల బదలాయింపులో దాదాపు ఆరేడు విధానపరమైన ప్రధాన ఉల్లంఘనలకు పాల్పడినట్టు విమర్శలొస్తున్నాయి. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించి 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి వంద ఎకరాల్లో చెట్లను నరికేశారు. 1974, 1981, 2006 పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరిగింది. 100 ఎకరాల భూముల్లో విధ్వంసాన్ని కొనసాగించిన ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కింది. విలువైన హెచ్‌సీయూ భూములను ముక్కలు చేసి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయంటూ సిద్ధాంత దాస్ నేతృత్వంలోని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) తన నివేదికలో పేర్కొన్నది. హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ, వన్యప్రాణి, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కడమే కాకుండా అర్థిక అక్రమాలకూ యత్నించిందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఈడీ, సీబీఐ, ఐటీ, విజిలెన్స్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ైక్లెమేట్చేంజ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పూనుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
2023లో మేడిగడ్డ బరాజ్‌లోని ఒక పిల్లర్ కుంగిపోతే, 24 గంటలు గడువక ముందే ఢిల్లీ నుంచి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వచ్చి హడావుడి చేసింది. కాళేశ్వరమే నిరుపయోగమని గగ్గోలు పెట్టింది. తమిళనాడులో ఇసుక అక్రమ రవాణా ఘటనలు పెరిగిపోయాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి మూడు ప్రత్యేక బృందాలు ఆ రాష్ట్రంలో గత ఏడాది రెండు, మూడు నెలలపాటు మకాం పెట్టాయి. అక్రమార్కులను పట్టుకోవడానికంటూ ఐఐటీ-కాన్పూర్ పరిశోధకుల సాయంతో టెక్నికల్ స్టడీని నిర్వహించాయి. సూరత్‌లో ఒక నగల వ్యాపారి రూ.10 లక్షల విలువైన జ్యువెల్లరీని ఎగుమతి చేస్తే, డాక్యుమెంట్లలో ఏదో పొరపాటు ఉన్నదని ఈడీ అధికారులు వారంపాటు విచారణ చేపట్టారు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి అమెరికా నుంచి రూ.50 కోట్ల విలువైన ఊల్ఫ్ జాతి కుక్కను కొనుగోలు చేశాడని యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకొన్న ఈడీ అధికారులు వెంటనే సదరు వ్యక్తి ఇంటికి వెళ్లారు. అయితే, ఆ కుక్క ఊల్ఫ్ జాతిది కాదని, దాని విలువ రూ.లక్ష కూడా చేయదని ఈడీ తేల్చింది. యూపీలోని లక్నో రైల్వేస్టేషన్లో ఓ క్లర్క్ రూ.5 వేలను లంచంగా తీసుకోవడం, చెన్నైలోని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఓ ఉద్యోగి పార్సిల్‌ను ఇవ్వడానికి రూ.10 వేలను లంచంగా డిమాండ్ చేసిన కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది. రాష్ట్ర పరిధిలోని ఏసీబీ అధికారులు చేధించాల్సిన ఈ కేసుల్లో సీబీఐ అధికారులు జోక్యం చేసుకోవడంపై విమర్శలొచ్చాయి. కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంలో రూ.వేల కోట్ల అర్థిక అక్రమాలకు ప్రయత్నాలు జరిగాయని సీఈసీ కమిటీలు, నివేదికలు చెప్తున్నా, అటవీ భూముల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, డీమ్డ్ ఫారెస్ట్‌లోని చెట్లను రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లను పెట్టి పెకిలించారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నా.. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, వర్సిటీని దిగ్బంధించినా ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. చిన్న కేసుల్లో ఈడీ, సీబీఐకి ఉన్న శ్రద్ధ, ముఖ్యమైన కేసుల్లో ఉండదేమోనని పలువురు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. తమ అనుయాయులను కాపాడేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇదంతా చేస్తున్నదా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
హెచ్‌సీయూ భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. వాస్తవ పరిస్థితిని తెలియజేయాలంటూ సిద్ధాంత దాస్ నేతృత్వంలోని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)ని నియమించింది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన సీఈసీ.. హెచ్‌సీయూ భూములు అత్యంత విలువైనవని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని ఉన్న ఈ భూములను ముక్కలు చేసి తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. టీజీఐఐసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్‌సీయూ భూములు వ్యాపార, ఆర్థిక దోపిడీకి గురవుతున్నాయని, దీనిపై స్టే ఇవ్వాలని కోర్టును కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి, పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని, చట్టాలను ఉల్లంఘించారని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ డీమ్డ్ ఫారెస్ట్‌లో ధ్వంసం చేసిన వంద ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంతమంది అధికారులు జైలు పాలవుతారో తమకు తెలియదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. 1996 డిసెంబర్ 12న తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని దుయ్యబట్టింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారించగా, తమ పరిధిలోని హెచ్‌సీయూ కేసులో ఇంప్లీడ్ అవ్వాలన్న కనీస విజ్ఞత కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడంపై న్యాయనిపుణులు మండిపడుతున్నారు. తమ పరిధిలోని హెచ్‌సీయూలో జరిగిన విధ్వంసంపై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్, ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అలీగఢ్, జేఎన్‌యూ వర్సిటీల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకొన్నప్పుడు క్షణాల్లో కేంద్ర బలగాలను దింపే కేంద్ర సర్కారు.. హెచ్‌సీయూలోని అటవీ భూముల రక్షణ విషయంలో ఎందుకు శ్రద్ధచూపడం లేదని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
హెచ్‌సీయూలో ఇంత తతంగం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై రాష్ట్ర బీజేపీ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. ‘జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కొట్లాడుతున్నాం అని చెప్పుకొంటున్న మనం.. హెచ్‌సీయూ విషయంలో ఈ అనుచితమైన ఆలస్యం, అనుచితమైన ఉపేక్ష, అనుచితమైన ఔదార్యం చూయించాల్సిన అవసరమేంటి? కారణమేంటి? రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విషయంలో కేంద్ర బీజేపీ వ్యవహరిస్తున్న ఈ తీరు రాష్ట్రంలో బీజేపీని మరింత బలహీనం చేస్తున్నది’ అనే ఆందోళన బీజేపీ రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతున్నది.
హెచ్‌సీయూ వివాదంపై ప్రధాని మోదీ ఇటీవల ప్రసంగిస్తూ.. అడవుల్లో బుల్డోజర్లను దింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉన్నదని దుయ్యబట్టారు. దీంతో మోదీ వ్యాఖ్యలను ఉంటంకిస్తూ, ‘హెచ్‌సీయూ విషయంలో మోదీ నిజంగానే ఆందోళనతో ఉన్నారా?’ అంటూ ఓ నెటిజన్ ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించాడు. దీనిపై గ్రోక్ స్పందిస్తూ.. హెచ్‌సీయూలోని అడవిని రేవంత్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని పేర్కొన్నది. అయితే, మోదీ హయాంలో పర్యావరణ పరిరక్షణ చట్టాలు నిర్వీర్యమైన విధానాన్ని గ్రోక్ ప్రస్తావించింది. అభివృద్ధి పేరిట అండమాన్ నికోబార్ దీవులు, హిమాలయ ప్రాంతాల్లో అడవులను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని వివరించింది. హెచ్‌సీయూ వివాదంలో ఒకవైపు చెట్లను రక్షించాలని మోదీ చెప్తూనే.. మరోవైపు పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడింది. దీనినిబట్టి మోదీ తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవేనని గ్రోక్ తేల్చి చెప్పింది.
చెట్లను నరికేయడం మనిషిని చంపడం కంటే పెద్ద నేరమని ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 454 చెట్లను విచక్షణారహితంగా నరికేసిన ఒక వ్యక్తికి చెట్టుకు రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 100 ఎకరాల్లో దాదాపు 80,000కుపైగా చెట్లను నరికివేసిందనే ఆరోపణలున్నాయి. ఈ లెక్కన సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఇన్ని చెట్లను నరికినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగించిన దమకాండకు భారత చట్టాల ప్రకారం శిక్షలు వేసుకొంటూపోతే, ఈ విధ్వంసానికి కారణమైన వారికి కనిష్ఠంగా 17.5 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 40.5 ఏండ్ల జైలుశిక్ష విధించాల్సి ఉంటుందని పర్యావరణ, న్యాయ నిపుణులు చెప్తున్నారు.
పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో రాష్ట్ర ప్రభుత్వం పెను విధ్వంసం సృష్టించినా, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించినా కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. తమ పరిధిలోని ఈ కేసులో కనీసం ఇంప్లీడ్ కూడా ఎందుకు కావడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్థిక దోపిడీ యత్నాలు జరిగాయంటూ సాక్షాత్తూ కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కుండబద్దలు కొట్టినా.. ఈడీ, సీబీఐ ఎందుకు ఇటువైపు రావడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హెచ్‌సీయూ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లు పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందంటూ ఇటీవల ఒక సభలో వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ.. హెచ్‌సీయూలో విధ్వంసానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదన్నది ఆసక్తికరంగా మారింది.
ఉల్లంఘన-1 : భారత అటవీ చట్టం-1927 నిబంధనలను తుంగలోతొక్కి డీమ్డ్ ఫారెస్ట్ ల్యాండ్‌ను ప్రభుత్వం తనఖాకు పెట్టింది.
శిక్ష: ఆరు నెలల జైలుశిక్ష, అటవీ భూమిలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం.
ఉల్లంఘన-2 : టీజీఐఐసీకి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థకు భూమిని తాకట్టు పెట్టింది. తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు చేపట్టారు. భూముల బదలాయింపులో దాదాపు ఆరేడు విధానపరమైన ప్రధాన ఉల్లంఘనలు చోటుచేసుకొన్నాయి.
శిక్ష: కనిష్ఠంగా రెండేండ్లు, గరిష్ఠంగా 14 ఏండ్లు జైలు శిక్ష.
ఉల్లంఘన-3 : అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించి 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి చెట్లను నరికేశారు. 1972, 1974, 1981, 2006 వన్యప్రాణి, పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరిగింది.
శిక్ష: ఏడేండ్లు జైలు శిక్ష.
ఉల్లంఘన-4 : వాల్టా చట్టంలోని సెక్షన్ 28(5) ప్రకారం ఒక చెట్టును నరికితే, అక్కడ లేదా పరిసరాల్లో కనీసం రెండు మొక్కలు నాటాలి. అలా కుదరనప్పుడు వాటి నిర్వహణ ఖర్చులు భరించాలి. 100 ఎకరాల భూముల్లో విధ్వంసాన్ని కొనసాగించిన రేవంత్ ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కింది.
శిక్ష : గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష.
ఉల్లంఘన-5 : హెచ్‌సీయూ భూ ముల్లో విధ్వంసంతో జాతీయ పక్షి నెమలి ఆవాసాన్ని ధ్వంసం చేసి, తద్వారా తన జీవనానికి ప్రమాదం కల్పించేలా చేశారు.
శిక్ష : ఏడాది నుంచి ఏడేండ్ల జైలు శిక్ష.
ఉల్లంఘన 6 : జింకల మరణానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమయ్యారు.
శిక్ష : రెండేండ్ల నుంచి ఏడేండ్ల జైలు.