Minister Ponguleti | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి.. నాది, నా తమ్ముడి ఇంటి నిర్మాణం హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉంటే కూల్చుకోండి’ అంటూ ఓపెన్ సవాల్ చేసి.. ఇప్పుడు మౌనం వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. 500 మీటర్ల నిబంధనపై ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించినా చడీచప్పుడు లేదు. ప్రస్తుతం ఉన్న గూగుల్ మ్యాప్‌లో చూస్తే నీటి నిల్వకు ఆయన ఇంటి నిర్మాణాలు చాలా దూరంగా ఉన్నాయి కదా అన్నట్టు కనిపిస్తుంది. పైగా 100 ఫీట్ల బఫర్‌జోన్ నిబంధన మాత్రమే ఉందనే అంచనాతో ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ 2007లోనే పురపాలక శాఖ ఇచ్చిన అర కిలోమీటరు నిబంధన మెమోను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. 2012లో పురపాలక శాఖ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన 168 జీవోను సైతం తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా కొన్నేండ్ల కిందట మ్యాప్‌లను బేరీజు వేసి అసలు గుట్టురట్టు చేసింది. దీంతో మంత్రి పొంగులేటి సోదరుల నిర్మాణాలపై ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరి వీటిపై సమాధానాలేవి?
‘500 మీటర్లు’ ప్రశ్నపై నోరు మెదపరేం?
కాంగ్రెస్ ప్రభుత్వం (2007లో) అధికారంలో ఉండగానే పురపాలక శాఖ ఇచ్చిన 500 మీటర్ల నిబంధన మెమోను ఈ నెల 25న ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెస్తే.. ఇప్పటిదాకా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నోరు మెదపలేదు. 2012లో పురపాలకశాఖ భవన నిర్మాణ అనుమతుల 168 జీవోనూ ‘నమస్తే తెలంగాణ’ తెరపైకి తెచ్చింది. దీనిపైనా సీఎం సహా మంత్రులెవరూ కిమ్మనలేదు. మరి 500 మీటర్లలోపు నిర్మాణాలు సక్రమమా? అక్రమమా? ఆ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నట్టా? లేనట్టా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టా? లేనట్టా? నిర్మాణాలు సక్రమమైతే సర్వే చేసి నిర్ధారించి, బహిరంగ ప్రకటన చేయొచ్చుగా? అక్రమమైతే హైడ్రా రంగంలోకి దిగదెందుకు?