హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో కొత్తగా ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ పేరుతో నూతన కోర్సు ప్రవేశ పెడుతున్నారు. దీనిని ‘నెక్ట్స్ జనరేషన్’ కోర్సు అని కూడా పిలుస్తున్నారు. యూనివర్సిటీ రూల్స్ 2025(ఆర్ 25)లో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకనుగుణంగా సిలబస్‌ను కూడా రూపొందిస్తున్నారు. సిలబస్ రూపకల్పనలో భాగంగా ఎన్ఐటీ, ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి.
జేన్టీయూలో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు మైనర్ కోర్సుగా ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఈ కోర్సు ప్రవేశ పెట్టడంలో డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) సహకారం తీసుకోనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆయా రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడ్డారు.
డిజిటల్, సూపర్ కంప్యూటర్లకు దీటుగా..
క్వాంటమ్ కంప్యూటర్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పని చేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే, ఇటు కంప్యూటర్ రంగంతోపాటు, అటు మానవ జీవన విధానం, పరిశోధన రంగాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటాయని వర్సిటీ అధికారులు తెలిపారు. అంటే మానవ ఆలోచనలకు మించి ఇది పని చేస్తుందని, క్షణాల్లో పనులను చక్కబెడుతుందని భావిస్తున్నారు. దీనిపై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని, ఆ దిశగా కృషి జరుగుతుందని వెల్లడించారు.