హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ప్రశ్నపత్రాల లీకేజీల బెడద నేపథ్యంలో ఈ సారి పరీక్షలకు ఎస్సెస్సీబోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. లీకేజీల నుంచి బయటపడేందుకు హైటెక్ సాంకేతికతను వినియోగించనున్నది. తొలిసారిగా పదో తరగతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రించనున్నది. ఎవరైనా ప్రశ్నపత్రాలను ఫొటోలు, వీడియోలు తీసినా, సోషల్‌మీడియాలో పోస్టుచేసినా, జిరాక్స్ తీసినా ఏ ప్రశ్నపత్రం, ఎక్కడి నుంచి లీకయ్యింది అన్నది ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇట్టే తెలిసిపోతుంది. ఏ సెంటర్లో, ఏ విద్యార్థి వద్ద నుంచి పేపర్ లీక్ అయ్యిందన్న విషయాన్ని సులభంగా పసిగడతారు. ఎస్సెస్సీ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం విడుదలయ్యాయి.
www.bse. telangana.gov. in వెబ్సైట్లో ఈ హాల్‌టికెట్లను పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లను పాఠశాలలకు సైతం పంపించామని, వెబ్సైట్ నుంచి సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎస్సెస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 2,650 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. అబిడ్స్‌లోని ఎస్సెస్సీబోర్డులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విద్యార్థులు 040-23230942 నంబర్‌ను సంప్రదించవచ్చని కృష్ణారావు తెలిపారు.