ఖమ్మం, ఆగస్టు 7: రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఆర్టీసీ విలీనం బిల్లును అటు అసెంబ్లీలోనూ, ఇటు మండలిలోనూ తాను ప్రవేశపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. సభలో తన ద్వారా బిల్లును పెట్టించి 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. రూ.150 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత తొలిసారి ఖమ్మం వచ్చిన మంత్రి అజయ్‌కుమార్‌కు.. మున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసీ ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు. ్రఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, అందుకు ప్రతి కార్మికుడూ ఆయనకు రుణపడి ఉండాలని సూఇంచారు. ఖమ్మం మున్నేరుపై తీగల బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరయ్యాయని, తాజాగా మున్నేరు ముంపు నుంచి రక్షణ కోసం మరో రూ.150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి అజయ్ వివరించారు. ఆర్సీసీ కాంక్రీట్ వాల్ నిర్మాణం పూర్తయితే మున్నేరు వరద ముప్పును నుంచి దాని పరీవాహక ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనకు అండగా నిలిచారని పువ్వాడ అజయ్ కొనియాడారు.
జగిత్యాలలో ఆర్టీసీ సంబురం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు.. సభ ఆమోదం తెలపడంతో సంస్థ ఉద్యోగులు సోమవారం జగిత్యాల బస్ డిపో ఎదుట సంబురాలు చేసుకున్నారు. ఉదయం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.