హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E car race) కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేటీఆర్‌ను అందులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay)అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షను భరించేందుకైనా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా పోరాడుదామని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని కేటీఆర్ సూచించారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు.
కాగా,ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్ టీమ్‌లో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు. కాగా, క్వాష్ పిటన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందీనగర్‌లోని కేటీఆర్ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.