హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేసేది నూతన ప్రాజెక్టుల నిర్మాణానికేనని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన సంతోషం తెలంగాణ ప్రజలకు పూర్తిగా ఇవ్వకుండానే 7 మండలాలను, 440 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న సీలేరు పవర్ ప్రాజెక్టును మోదీ సర్కార్ ఏపీకి ధారాదత్తం చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిందన్నారు. 1,080 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్రంగా భద్రాద్రి ప్లాంటును తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో తుప్పుపట్టిన సామగ్రిని వినియోగించారన్న బండి వ్యాఖ్యలపై మంత్రి నిప్పులు చెరిగారు. తుప్పుపట్టిన సామగ్రిని వినియోగిస్తే.. విద్యుత్తు ఉత్పత్తి ఎలా జరుగుతున్నదని నిలదీశారు. సింగరేణి 4 బొగ్గు బ్లాకులను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేవలం 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వంద లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, ఆ అప్పులతో ఏం చేసిందో కేంద్రం చెప్పగలదా? అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులు సక్రమంగా వినియోగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పక్కా ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ‘తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినవాళ్లం.. అప్పులు తీసుకురాలేమా?’ అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాలు కరెంటు కోతలతో అల్లాడుతుంటే తెలంగాణ మాత్రం వెలుగులతో మెరిసిపోతున్నదని, ఈ దృశ్యం చూడాలంటే బండి సంజయ్ రాత్రి పూట విమానంలో పర్యటించాలని చురకలు అంటించారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై బండి సంజయ్ వాదన తుగ్లక్ కన్నా హీనంగా ఉన్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని నిర్మాణంలో ఒక్క పైసా అవినీతి జరిగే ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే రైతాంగంపై తీవ్రమైన విద్యుత్తు భారం పడుతుందని, బీహెచ్ఈఎల్కు అప్పగించారని స్పష్టం చేశారు. బండి సంజయ్ వాదన ఆయనకున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించిందని, అటువంటప్పుడు కమీషన్లకు ఆస్కారమే ఉండదని చెప్పారు. సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్ దగ్గర మోదీ కమీషన్లు తీసుకొన్నట్టే ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే తపన సీఎం కేసీఆర్‌ది అని, వాటిని తెగ నమ్మటమే మోదీ విధానమని ఆరోపించారు. అదానీ, అంబానీకి భద్రాద్రి ప్లాంట్ దక్కలేదనే అక్కసుతో బండి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేస్తున్నారని అన్నారు. ‘రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నీ అబ్బసొత్తు కాదు.. అందులో తెలంగాణ వాటా ఉన్నది’ అని బండి సంజయ్‌పై వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు. ఎరువుల తయారీ కర్మాగారం కనుక గ్యాస్ లీక్ అవుతున్నదని, దాన్ని కంట్రోల్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లేఖ రాస్తే బండి సంజయ్ అవగాహన రాహిత్యంతో దుర్మార్గమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు.