హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ, సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకే హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలంలో వందశాతం రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందని హరీశ్‌రావు ప్రశ్నిస్తే.. దానికి మంత్రి తుమ్మల సమాధానం చెప్పకుండా, వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్ధ్దతి కాదని హితవుపలికారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తుమ్మల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో మంత్రి పదవి కోసం పాకులాడే వ్యక్తి అని, ఇప్పటివరకు మూడు పార్టీలు మారి మంత్రి పదవులు అనుభవించారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట ఉంటున్న హరీశ్‌రావును విమర్శించే స్థాయి మంత్రి తుమ్మలకు లేదని పువ్వాడ పేర్కొన్నారు. తుమ్మల మంత్రిగా ఉండి కూడా ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. యూరియా కోసం రైతులు పడుతున్న తంటాలు ప్రభుత్వ అసమర్థత వల్ల కాదా? ఇది మంత్రి అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. మున్నేరు వరదల్లో కొట్టుకొనిపోతున్న వారిని కాపాడేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ తెప్పించలేక పోయారని హరీశ్‌రావు ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. కేరళ వెళ్లేందుకు హెలికాప్టర్ వాడిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్నేరు వరదలప్పుడు మాత్రం వాడలేదని దుయ్యబట్టారు. గిరిజనుల భూమిని మంత్రి ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో మక్కలు సకాలంలో ఎందుకు కొనడం లేదని ప్రశ్నించిన హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల దూషణలకు దిగుతున్నారని వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం కేసులో విషయంలో న్యాయకోవిదులను కలిసేందుకు తాము ఢిల్లీ వెళ్తే, ఆరెస్సెస్ నాయకులను కలిశామంటూ తుమ్మల దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘హరీశ్‌రావు ఖమ్మం జిల్లాకు రావడమే తప్పా? గతంలో వరదలప్పుడు జిల్లాకు వస్తే వారిపై దాడి చేశారు. హరీశ్‌రావు అంటే ఎందుకు భయపడుతున్నారు?’ అని వద్దిరాజు ప్రశ్నించారు. ఇంకోసారి హరీశ్‌రావు గురించి మంత్రి తుమ్మల మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అహంకారం గురించి అందరికీ తెలుసునని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. రైతులకు యూరియా ఇవ్వలేని దద్దమ్మ మంత్రి తుమ్మల అని ఎద్దేవా చేశారు. షాపులో యూరియా లేదు కాని, యాప్‌లో ఉన్నదని చెప్పుకొనే మంత్రి అని దుయ్యబట్టారు. అంతా మెక్కుడు, తొక్కుడే తుమ్మల విధానమని మండిపడ్డారు. ఇన్నేండ్లు మంత్రిగా ఉండి, భక్తరామదాసు ప్రాజెక్ట్‌ను కట్టాలనే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు ఇవ్వడానికి 12% కమీషన్ కొట్టేయడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు.