మహాదేవపూర్, జూన్ 8: మేడిగడ్డ బరాజ్‌లో ఆరుగురు యువకులు గల్లంతై మృత్యువాత పడిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మహాదేవపూర్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మేడిగడ్డ బరాజ్ వద్ద గల్లంతైన యువకుల మృతుల కుటంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే పక్కన పెట్టిందని, అక్కడ వరద ప్రవాహం పెరుగుతుందని తెలిసినా కనీసం అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అభం శుభం తెలియని ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించి అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అక్కడ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహిళ మండల అధ్యక్షురాలు ఒడేటి స్వప్న, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీమ్ ఖాన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రకాష్, కూరతోట శ్రీహరి, కారెంగుల బాపూరావు, వంశీ, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.