పెద్దపల్లి : అధికారంలోకి రాగానే మంథని ఎమ్మెల్యే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కస్తూర్బా గురుకుల పాఠశాల ఆవరణలో రెండు మూడు రోజుల క్రితమే పరిశుభ్రత కోసం గడ్డి మందు కొట్టించారని, అయితే విద్యార్థులకు పనిష్మెంట్ పేరుతో గడ్డి తొలగించే పని అప్పగించడంతో అస్వస్థతకు గురైనట్లు తమకు పూర్తి సమాచారం అందిందన్నారు.
అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైతే పరామర్శించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు శీతాకాలం కావడంతో చలి ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతగా గురయ్యారని, అస్తమా కారణమనే రీతిలో మాట్లాడారని, మంత్రిగా ఆయన మాట్లాడిన తీరు అవివేకానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని గురుకులాల పనితీరు అధ్వాన్నంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల చులకనగా మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.