మంథని, అక్టోబర్ 31 : సర్కారు వైఫల్యం కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంథని ఏఎంసీ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు ఇక్కడ ధాన్యం పోసి పదిహేను రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో వర్షాలకు తడిసి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు. కనీసం టార్ఫాలిన్లు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
ఈ ప్రాంత ప్రజల కష్టాలపై కనీస అవగాహన లేని వ్యక్తులకు ఓటు ద్వారా మనం అధికారం కట్టబెడితే ఇలా నష్టాలను చూడాల్సి వస్తున్నదని వాపోయారు. మార్కెట్ యార్డులో నెల క్రితం పాడి డ్రైయర్ మిషన్ తీసుకు వచ్చినా ఇంకా ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకవర్గ సభ్యులు, అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఆయనవెంట బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, యాకుబ్, పిల్లి సత్యనారాయణ, కాయితీ సమ్మయ్య, బడికెల శ్రీనివాస్, తిరుపతి, కొవ్వూరి శ్రీకర్, సంతోష్, ఇర్ఫాన్, తదితరులు ఉన్నారు.