హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ జోనల్ లెవల్ క్రీడా పోటీలు 6నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సొసైటీ తాజాగా జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో పోటీలు కొనసాగనుండగా, దాదాపు 20,485 మంది విద్యార్థులు వీటిలో పాల్గొననున్నారు. మొత్తంగా 11 క్రీడావిభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు.
కాగా జోనల్ క్రీడా పోటీలను స్వాగతిస్తున్న గురుకుల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు సొసైటీ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించి, శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణను పెంచడమే జోనల్ పోటీల లక్ష్యమని, కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుత నిర్వహణ కొనసాగుతున్నదని మండిపడుతున్నారు. గురుకుల పాఠశాలల్లో క్రీడలపై సరైన శిక్షణా కార్యక్రమాలు, ఆటల ప్రాథమిక నైపుణ్యాలపై విద్యార్థులకు ఎలాంటి మార్గదర్శక శిక్షణ ఇచ్చేందుకు సమయమే ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.