హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల అంశంలో పౌరసరఫరాల సంస్థ మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదు. 7 వేలకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 70 శాతానికిపైగా కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి ఇప్పటికి మూడువారాలు పూర్తయినా కొన్నది 6.75 లక్షల టన్నులు మాత్రమే. దీనినిబట్టి కొనుగోళ్లపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7,200 కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించిన పౌరసరఫరాలశాఖ 7,104 కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించింది. వీటిలో 2,480 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. ఇంకా 4,720 కేంద్రాలు అంటే దాదాపు 70 శాతానికిపైగా కేంద్రాల్లో ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలుచేయలేదు.
ఎడతెగని ఎదురుచూపులు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది. మరోవైపు, అకాల వర్షం అన్నదాతను భయపెడుతున్నది. అకస్మాత్తుగా కురిసే వాన నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అకాల వర్షానికి కొన్నిచోట్ల ధాన్యం తడిచిపోతుంటే, మరికొన్ని చోట్ల కొట్టుకుపోతున్నది. తడిచిన ధాన్యానికి మొలకలు వస్తుండడంతో అన్నదాత ఆవేదన చెప్పనలవి కాకుండా ఉన్నది. ప్రభుత్వం ముందే కొనుగోళ్లు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ ఇబ్బందులు తప్పి ఉండేవని రైతులు చెప్తున్నారు.