తుర్కపల్లి, జూన్ 17 : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం అత్యద్భుతంగా ఉన్నదని పంజాబ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ బల్జీత్‌కౌర్ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో శనివారం ఆమె పర్యటించారు. గ్రామంలోని దళితబంధు లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించారు. గ్రామంలో కలియతిరుగుతూ ఒక్కో యూనిట్‌ను సందర్శించారు. దళితబంధు లబ్ధిదారుల గత ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. దళితబంధు యూనిట్ల అనంతరం తామంతా సంతోషంగా ఉన్నామని, నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నట్టు లబ్ధిదారులు ఆమెకు వివరించారు.
ఈ సందర్భంగా బల్జిత్‌కౌర్ మాట్లాడుతూ.. దళితబంధుతో లబ్ధిదారుల కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నట్టు గుర్తించామన్నారు. ఈ పథకాన్ని అధ్యయనం చేసేందుకే ఇక్కడికి వచ్చామని, దళిత కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని సాధించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పంజాబ్‌లోనూ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఈమె వెంట పంజాబ్ రాష్ట్ర అధికారులు రమేశ్‌కుమార్, జస్ ప్రీత్‌సింగ్, జగదీశ్శర్మ, తెలంగాణ నోడల్ అధికారి అశిష్కుతిరియా, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కిషన్ తదితరులు ఉన్నారు.