హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వీహెచ్పీ నేత, పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జీ రాఘవరెడ్డి, ఆయన భార్య, కొడుకు, కూతురు కలిసి తమను వేధిస్తున్నారని రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి తెలిపారు. న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ మెయిల్ ద్వారా వినతిని పంపినట్టు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీని సందర్శించనున్నారు. ఈ కాలేజీ రాఘవరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి ఈ మెయిల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, వారి కొడుకు, తన భర్త ఏక్నాథ్రెడ్డి కలిసి తనను, తన ఎనిమిదేండ్ల కూతురును రెండేండ్లుగా వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆ లేఖలో వివరించారు. వరకట్నం కోసం వేధించారని, చంపుతామని బెదిరించారని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు.