CM KCR | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తనకు పిల్లలు లేరని, కేసీఆరే తన పెద్ద కొడుకని, ఆయనకే ఓటేస్తానని ఓ వృద్ధురాలు చెప్పారు. తమకు పెద్దకొడుకులా నెలనెలా డబ్బులు ఇస్తున్నాడని, ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్‌గా మారడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సన్నివేశం హృదయాన్ని హత్తుకొనేలా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇలాంటి కోట్లాది మంది ఆత్మీయుల ఆశీస్సులు కేసీఆర్‌ను మళ్లీ గెలిపిస్తాయని పేర్కొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్న ఓ యూట్యూబ్ చానల్‌తో సదరు వృద్ధురాలు మాట్లాడారు. పనికి పోయేందుకు చేతకావడంలేదని, సీఎం కేసీఆర్ ఇచ్చే పెన్షన్ పైసలతోనే సర్దుకొని తింటున్నట్టు చెప్పిన ఆమె మాటలు పలువురిని నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి. నెలనెలా రూ.2,016 పెన్షన్ వస్తున్నట్టు ఆమె చెప్పారు. తనకు పిల్లలు లేరని, చూసుకొనేవారు ఎవరూ లేరని, ఇప్పుడైతే రెక్కాడుతున్నది, బుక్కాడుతున్నదని, మునుముందు ఎలా ఉంటుందో తెలియని పేర్కొన్నారు. ఎవరికి ఓటు వేద్దామని అనుకుంటున్నారు? ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? అనే ప్రశ్నకు కేసీఆరే గెలవాలని, ఆయనే తమకు పెద్దకొడుకులా నెలనెలా డబ్బులు ఇస్తున్నాడని ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకున్నారు.