హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను ప్రజలు ఆమోదించారని, జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలలో ఈ విషయం తేలిపోయిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో హైడ్రా ను అడ్డంపెట్టుకొని తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, వ్యక్తులు, వ్యవస్థలు బురదజల్లినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. మూసీ విషయంలోనూ రాద్ధాం తం చేశారని, అయినా ప్రజలు పట్టించుకోకుండా, హైడ్రాను ఆమోదించారని పేర్కొన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అభివృద్ధి కోసం కలిసిరావాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. మూడేండ్లలో ఎన్నికలున్నాయని, రెండేండ్ల పాటు రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామ ని ప్రతిపాదించారు.