జనగామ చౌరస్తా, జూన్ 17: ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) పదోన్నతి పోస్టుల్లో బీఈడీ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) కు అవకాశం కల్పించాలని సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనగామలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి.. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి న్యాయమైన తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డీఈవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అంబటి అంజయ్య, సూడి సత్యనారాయణ మాట్లాడుతూ.. బీఈడీ అర్హతతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జీటీలుగా పనిచేస్తున్న 70 వేల మంది ఉపాధ్యాయులు ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అన్యాయానికి గురువుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్ పోస్టులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీవో 12 ప్రకారం 2015 వరకు బీఈడీ చేసిన వారు పీఎస్ హెచ్ఎం పోస్టులకు అర్హులని, ఇప్పుడు ఎందుకు అర్హులు కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే.. అన్ని జిల్లాల్లోని బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలతో దశల వారీగా ఆందోళన చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీటీ ఉపాధ్యాయులు జయపాల్‌రెడ్డి, బికోజీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.