హనుమకొండ, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలతో చుక్కలు చూపిస్తున్నది. వ్యవసాయానికి, రైతులకు ఇబ్బందులు కలిగించేలా చేస్తున్నది. సరిపడా యూరియా సరఫరా చేయకుండా రైతులను అవస్థ పెడుతున్న ప్రభుత్వం.. యాసంగిలో కరెంటు సరఫరా విషయంలోనూ ఇదే చేస్తున్నది. నారు మడులు, నాట్ల సమయంలోనే కోతలు పెడితే సాగు విస్తీర్ణం పెరగకుండా ఉంటుందని, ఎండాకాలంలో ఎక్కువ కరెంటు వినియోగం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో పది రోజులుగా వ్యవసాయానికి కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. రోజూ పొద్దున ఆరు గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు. గంట నుంచి ఆరు గంటల వరకు ఒక్కో ఊరిలో ఒక్కోలా రోజూ ఎలాంటి సమాచారం లేకుండా కోతలు కొనసాగుతున్నాయి.
ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల్లోనూ అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. గంటల తరబడి కరెంట్ పోతుండటంతో వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతున్నది. వరి నాట్ల కోసం దుక్కులు దున్నే పనులు జోరుగా సాగుతున్నాయి. సరిపడా నీటి సరఫరా ఉంటేనే అదనులో నాట్లు వేసే పరిస్థితి ఉంటుంది. మక్కజొన్న, మిర్చి, కూరగాయలు, పండ్లు, పూల తోటలకు రోజూ నీరు అందించాలి. అన్ని పంటలకు ఎక్కువగా సాగునీరు అవసరమయ్యే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలను పెంచుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి నిరంతరం కరెంటు వచ్చిందని, ఇప్పుడు చలికాలంలోనే కోతలు ఎక్కువగా ఉండటంతో పంటలను సాగు చేయలేని పరిస్థితి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఈ అయోమయ పరిస్థితుల్లో పనులు ముందుకు సాగడంలేదని రైతులు వాపోతున్నారు. అప్రకటిత కరెంటు కోతలను నిలిపివేసి పంటలను కాపాడుకునేలా నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఎన్పీడీసీఎల్ పరిధిలో 12.77 లక్షల వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోనూ అనధికారికంగా కరెంటు కోతలు ఉన్నట్టుగా అధికారులు అంగీకరిస్తున్నారు. ఉన్నత స్థాయిలోని ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నట్టు చెప్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లపై వసూలు చేసే కస్టమర్ సర్వీస్ చార్జీలను సాకుగా చూపి గంటల తరబడి కరెంటు కోతలు పెట్టాలని మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు కింది స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. నెలకు రూ.30 చొప్పున ఏడాదికి రూ.360 చొప్పున ప్రతి వ్యవసాయ కనెక్షన్పై కస్టమర్ సర్వీస్ చార్జి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్లో ఈ చార్జీలను వసూలు చేయాలి. ఎన్పీడీసీఎల్లోని ఉన్నతాధికారులు కరెంటు కోతల కోసం కస్టమర్ సర్వీస్ చార్జీలను సాకుగా చూపుతున్నారు.
గ్రామా ల్లో రైతుల వద్దకు వెళ్లి చార్జీల వసూలు చేయాలనే సూచించకుండా.. కరెంటు కోత లు విధిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ చార్జీల కోసం కరెంటు నిలిపివేసినట్టు కింది స్థాయి సిబ్బందితో చెప్పిస్తున్నారు. కరెంటు కోతలు ఎందుకని ఫోన్లో అడుగుతున్న రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ‘మీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని అన్ని వ్యవసాయ కనెక్షన్ల కస్టమర్ సర్వీస్ చార్జీలు చెల్లిస్తేనే కరెంటు సరఫరా ఉంటుంది. అందరికీ చెప్పి త్వరగా చార్జీలు కట్టించండి. లేకుంటే కరెంటు కోతలు కొనసాగుతాయి’ అని ఎన్పీడీసీఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. యాసంగి నాట్ల సమయంలో కరెంటు కోతలు ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కరెంటు బాగా పోతాంది. రోజుల నాలుగైదుసార్లు కరెంట్ పోతున్నది. పోయినప్పుడల్లా గంట వరకు రానేరాదు. పొద్దటిపూట నారుమళ్లు పారిచ్చుడు అయితలేదు. కరెంట్తోని ఇబ్బంది అయితాంది. అప్పట్లోనే కరెంట్ మంచిగా ఉండేది. పొద్దున వచ్చి సిచ్చు ఏసిపోతే మళ్ల సాయంత్రం వచ్చి బంద్ చేసేటోళ్లం. పంటలకు నీళ్లు పుషలంగా అందేటివి. ఇప్పుడు ఊకే ఊకే కరెంట్ పోయ్యి వత్తంటే పొలం పారుతలేదు.
– ఏశబోయిన మల్లేశ్, నారాయణగిరి, మం: ధర్మసాగర్, జిల్లా: హనుమకొండ