హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన వెంటనే గ్రామ సుపరిపాలనపై దృష్టి సారించి గ్రామాధికారులను నియమించామని, వారు ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి జీపీవోలకు నియామకపత్రాలు అందజేసి అనంతరం మాట్లాడారు. భూభారతిని తొలుత నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకువచ్చామని తర్వాత 32 మండలాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందించామని వివరించారు.
ఎవరి నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా 8.65 లక్షల దరఖాస్తులు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాలపై స్టేను తొలగించేలా ప్రయత్నించి సఫలమయ్యామని తెలిపారు. రాష్ట్రంలో 6,860 క్లస్టర్లను ఏర్పాటుచేసి 10,954 రెవెన్యూ గ్రామాలలో గ్రామ పరిపాలనాధికారుల నియామకం చేపడుతున్నామన్నారు. సర్వేయర్ల నియామకం ద్వారా భూ సమస్యలకు చెక్ పెడతామన్నారు. 318 మంది సర్వేయర్లకు అదనంగా 800 మందిని నియమించడమే గాక 7,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను వచ్చే ఉగాదిలోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. అనంతరం జీపీవోలతో పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతం : లచ్చిరెడ్డి
జీపీఓల నియామకంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తెలంగాణ తహాసీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడం వలన గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.
ప్రభుత్వానికి ట్రెసా కృతజ్ఞతలు
గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి 5,610 మంది గ్రామ పాలనాధికారులను నియమించి వారికి నియామక పత్రాలు ఇచ్చినందున తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి కే గౌతమ్‌కుమార్, ట్రెసా రాష్ట్ర కమిటీ ఈ మేరకు ఒక ప్రకటనప్రకటన విడుదల చేసింది.