హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ల మంజూరు, నిధుల చెల్లింపు తదితర అంశాలపై కేటీఆర్ ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 7వేల మంది విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున సాలర్షిప్లను అందజేశామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయడంలేదని దుయ్యబట్టారు. విదేశీ విద్యకు సంబంధించి రూ.303 కోట్లు విడుదల చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 అక్టోబర్లోనే ప్రకటించిందని, నేటికీ నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో 2,500 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, గ్రీన్చానెల్ ద్వారా స్కాలర్షిప్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ మాట్లాడుతూ.. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప మంజూరు చేయడం లేదని విమర్శించారు. తక్షణం ఉపకార వేతనాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బదులిస్తూ.. సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
వివరాలిస్తే ఓవర్సీస్ స్కాలర్షిప్లిస్తాం ; మంత్రి పొన్నం ప్రభాకర్
శాసనసభలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. విదేశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు పెండింగ్లోని స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు విద్యార్థుల వివరాలు అందిస్తే, తక్షణమే స్కాలర్షిప్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. బీసీ విద్యార్ధుల ఓవర్సీస్ స్కాలర్షిప్లు 300నుంచి 700లకు పెంచినట్టు పొన్నం వెల్లడించారు.