హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి స్థిరీకరణకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, మిషన్ భగీరథశాఖల మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఇండియా-2047 వాటర్ సెక్యూర్ సదస్సుకు హాజరై ఆమె మాట్లాడారు. తెలంగాణలో ఏటా సుమారు రూ. 5 వేల కోట్లు వెచ్చించి ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. స్థిరీకరణ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీతి ఆయోగ్ సిఫారసు మేరకు రూ.16 వేలకోట్లు మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు మంత్రి మిషన్ భగీరథ, ఇతర తాగునీటి పథకాలను పీపీటీ ద్వారా వివరించారు.