హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న పునరావాసంపై దృష్టి పెట్టాలని ఎస్ఐబీ అధికారులను డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. వారికి తెలంగాణ పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఉన్నతాధికారులు, సిబ్బందితో సుదీర్ఘంగా సమీక్షించారు. లొంగిపోయిన క్యాడర్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలుగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఎస్ఐబీ తీసుకోవాలని చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా తీవ్ర ప్రభావం చూపిన మావోయిజం ప్రస్తుతం ముగింపుదశలో ఉన్నదని, మారిన పరిస్థితులకు అనుగుణంగా నిఘా విభాగాలు కొత్త సవాళ్లపై దృష్టి సారించాలని అన్నారు. గడిచిన రెండేండ్లలో తెలంగాణ పోలీసుల ఎదుట రికార్డు స్థాయిలో 820 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఎస్ఐబీ సాధించిన విజయమని అభినందించారు. లొంగిపోయిన వారిలో నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 22 మంది స్టేట్ కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 45 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 173 మంది ఏరియాకమిటీ సభ్యుల వంటి అగ్రనేతలు ఉన్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేలా రాష్ట్ర పోలీసు విభాగానికి ఎస్ఐబీ వెన్నుదన్నుగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఐపీ కార్తికేయ పాల్గొన్నారు.