వరంగల్, ఫిబ్రవరి 2 : ‘కమిషనరమ్మా కాల్మొక్తా.. మా కాలనీకి తాగు నీళ్లివ్వండి’ అంటూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని చెరబండరాజుకాలనీవాసులు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ను వేడుకున్నా రు. మాడవీధుల నిర్మాణం పేరుతో భద్రకాళీ ఆలయం పక్కన ఉన్న గుడిసెవాసుల ను నిరాశ్రయులను చేయవద్దని కమిషనర్ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాగునీళ్లు లేక రెండు వారాలుగా అరిగోస పడుతున్నామని విలపించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి ఆదేశాలతో రెండు వారాలుగా కార్పొరేషన్ అధికారులు కాలనీకి నీటి సరఫరా నిలిపివేయడంపై నిలదీశారు. సోమవారం కాలనీలోని మహిళలు పెద్దఎత్తున ఖాళీ కుండలు, బిందెలతో డప్పుచప్పుళ్ల తో ర్యాలీగా కార్పొరేషన్‌కు తరలివచ్చి కౌన్సిల్‌హాల్ ఎదుట ఆందోళనకు దిగారు. రెండుగంటలపాటు బైఠాయించి.. ఎమ్మె ల్యే, మేయర్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తు న నినాదాలు చేశారు. నీటి సరఫరాపై కమిషనర్ సరైన హామీ ఇవ్వకపోవడంతో కాలనీవాసులు ఖాళీ కుండలను కౌన్సిల్ హాల్ ముందు పగులగొట్టారు.