ఖైరతాబాద్, డిసెంబర్ 8 : తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే, వాటిని గొప్పగా చెప్పుకొని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తమకు మాత్రం బిల్లులు ఇవ్వటం లేదని తాజా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఏడాదికాలంగా సీఎంతోపాటు మం త్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించటం లేదని పేర్కొన్నారు. రిలే దీక్షలు, శాంతియుత నిరసన చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తామెందుకు చెల్లించాలని ఓ మంత్రి అంటున్నాడని వాపోయారు. అవే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ, బిల్లులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు చెందిన సర్పంచులు కావడంతోనే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పల్లెబాట చేపట్టి కాంగ్రెస్ అబద్ధపు హామీలను, వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ సర్పంచులు కే గంగాధర్, లింగ ంపల్లి కరుణాకర్, దుమ్మ అంజయ్య, చెన్నమనేని స్వయం ప్రభ, గున్నాల లక్ష్మణ్, కెంద గంగాధర్, రంగు రాములు, మల్యాల దేవయ్య, ఆరె మహేందర్, రాసూరి రాజేశ్, కాదస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.