జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రొటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి స్థానిక గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఆహ్వానించి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ సరితను పిలవకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు.
ఎమ్మెల్యే పార్టీ కండువా వేసుకొని స్టేజ్ పైకి వెళ్లాలని, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ సరిత వర్గీయులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రతిసారి మమ్మల్ని అవమానాలకు గురి చేస్తున్నారని మల్లు రవి ముందు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. కొద్దిసేపు ఎంపీ స్టేజ్ పైకి వెళ్లకుండా సరిత వర్గీలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సమావేశం మొదలైనప్పటి నుంచి మంత్రి పొంగులేటి మాట్లాడే వరకు కార్యకర్తలు వారి ప్రసంగాలకు అడ్డు తగులుతూనే వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలి అవకాశం కోసం పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులకు సరిత వర్గీల మధ్య కొంతసేపు వాగ్వాదం నెలకొంది. ఎట్టకేలకు పోలీసుల వారిని శాంతింప చేసి అక్కడ్నుంచి పంపి వేయడంతో సమస్య సద్దుమణిగింది. చివరకు సరితతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడి గొడవలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సరిత, కృష్ణ మోహన్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాగా, కినుకవహించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.