Indiramma Indlu | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లను కేవలం కాంగ్రెస్ పార్టీ వారికే కేటాయిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడి నిరసనలను అక్కడే తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామాల్లో ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు తమకు రాలేదని ఆందోళనలు చేసినా, నిరసన తెలిపినా వెంటనే ‘ఇక చాలు ఆపండి’ అంటూ ఇంటెలిజెన్స్ సిబ్బంది నుంచి కాల్స్ వస్తున్నాయని ప్రజలు చెప్తున్నారు. ఎవరైనా వాట్సాప్ గ్రూపుల్లో ఆవేశంగా పోస్టులు పెడితే వెంటనే.. ‘మీరు పెట్టిన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి.
లేకపోతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పలువురు వాట్సాప్ యూజర్లు చర్చించుకుంటున్నారు. నిరసన తెలిపే వారికి నేరుగా ఫోన్ చేస్తున్న పోలీసులు.. గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టకుండా స్థానిక కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా పోలీసుల నుంచి కాల్స్ వస్తుండటంతో తమ వాట్సాప్ గ్రూపులపై ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని భావిస్తున్న గ్రూపు అడ్మిన్లు ‘అనుమానిత నంబర్ల’ను తమ గ్రూపుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిసింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఇందిరమ్మ ఇండ్ల విచారణకు వెళ్లిన ఎంపీడీవో పూర్ణచందర్రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ‘నిరుపేదలకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. 5 ఎకరాల భూమి ఉన్న వాళ్లు, ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు ఇండ్లు కేటాయించడమేంటి’? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
– తొర్రూరు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి కాలనీవాసులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు, కర్రలు పెట్టి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలమైనప్పటికీ తమకు ఇండ్లు మంజూరు కాలేదని వాపోయారు. అధికారులు బాధ్యతగా సర్వే చేసి నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.
-అన్నపురెడ్డిపల్లి