నిర్మల్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళనతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం అట్టుడుకుంది. దిలావర్పూర్, గుండంపెల్లి, బన్సపెల్లి, సముందర్‌పెల్లి గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. నిర్మల్-భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ పట్టుబట్టారు. అక్కడే వంటావార్పు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు. ఈ క్రమంలో చర్చల కోసం వచ్చిన ఆర్డీవో రత్న కల్యాణిని ఆందోళనకారులు దాదాపు నాలుగు గంటలపాటు నిర్బంధించారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో భారీ బందోబస్తు మధ్య పోలీసులు నిర్మల్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఆర్డీవోను తీసుకెళ్లారన్న ఆగ్రహంతో ప్రజలు ఆర్డీవో వాహనాన్ని ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి కారును రోడ్డుపై పడేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. రెండోరోజు బుధవారం కూడా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తారని తెలిసిన పోలీసులు గ్రామాలకు వెళ్లి.. మంగళవారం ధర్నాలో పాల్గొన్న కొందరిని అరెస్టు చేశారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పోలీసులను, వారి వాహనాలను వెంబడిస్తూ రాళ్లతో దాడులకు దిగారు. చేసేది లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయింపు
ఆందోళనకారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దిలావర్పూర్ గ్రామానికి చెందిన మహిళలు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకున్న మహిళలు.. స్థానిక ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ కూడా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న గుండంపెల్లి, సముందర్‌పెల్లి, బన్సపెల్లి గ్రామాల ప్రజలు, మహిళలు, యువత పెద్దఎత్తున దిలావర్పూర్కు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. నిర్మల్-భైంసా ప్రధాన రహదారిపై ధర్నాకు కూర్చున్నారు. దీంతో పోలీసులు నిర్మల్ నుంచి దిలావర్పూర్కు వెళ్లే మార్గం, భైంసా నుంచి దిలావర్పూర్ వచ్చే రోడ్డుపై భారీగా మోహరించారు. ధర్నా జరుగుతున్న దిలావర్పూర్కు వాహనాలు వెళ్లకుండా దారి మళ్లించారు. కాగా.. భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్లకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయాయి.
ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
మహిళలు, గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డు మీద బైఠాయించడంతో దిలావర్పూర్ పోలీస్‌స్టేషన్‌తోపాటు ఆ ప్రాంగణంలోనే ఉన్న ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాలకు అధికారులు తాళాలు వేశారు. రైతులు రోడ్ల మీద ఉన్నంత సేపు మధ్యాహ్నం రెండు గంటల దాకా కార్యాలయాలకు తాళాలు వేసే ఉన్నాయి. ఇంతలో ఆందోళనకారులు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో పని చేసే వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు తాళాలు వేసుకొని బయటికి వెళ్లిపోయారు.
పోరాటానికి బీఆర్ఎస్ అండ..
ఇథనాల్ ఫ్యాక్టరీపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందునుంచి అండగా నిలిచింది. స్థానిక గ్రామాల యువకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. ఇటీవల నిర్మల్ వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిలపక్ష సభ్యులతో మాట్లాడారు. వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని భరోసా కల్పించారు. దిలావర్పూర్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితుల నెలకున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ బుధవారం స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రాంకిషన్రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల అరెస్టులపై నిరసన తెలపాలని, పోరాటానికి మద్దతుగా నిలవాలని ఆదేశించారు.
నిర్మల్ ఘటనపై విచారణ జరిపించండి
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఆర్డీవో పట్ల ఆందోళనకారులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
మా పోరాటం ఫలించింది
సంవత్సరకాలంగా మేము ఇథనాల్ పరిశ్రమను నిర్మించవద్దని శాంతియుతంగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. అనేకసార్లు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించాం. అయినప్పటికీ ఎన్నికలు అయిపోగానే పనులను ప్రారంభించారు. అప్పటినుంచి ఆందోళనలు చేస్తున్నాం. మంగళవారం చుట్టుపక్కల గ్రామల ప్రజలందరం కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించాం. ఈ పొద్దు ధర్నా చేసిన రైతులను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను అందరం కలిసి అడ్డుకోవడంతో రైతుల ఆందోళన ఉధృతం అవుతుందని గమనించిన ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయానికి పిలిచి పరిశ్రమ పనులు నిలిపివేస్తున్నామని ప్రకటించింది. సంతోషంగా టపాసులు కాల్చి సంబురాలు జరుపుకొన్నాం.
– చిన్నరెడ్డి, రైతు, గుండంపల్లి
ఇది రైతుల విజయం
పచ్చని పొలాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం. గత సంవత్సరం రైతులందరం కలిసి అప్పటి నాయకులను, కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించాం. అయినప్పటికీ ప్రభుత్వం మళ్లీ పనులను ప్రారంభించింది. రైతులందరం ఏకమై ఇథనాల్ పరిశ్రమను నిలిపివేసేందుకు నడుం కట్టాం. జాతీయ రహదారి పక్కన రిలే నిరహార దీక్షలు చేపట్టాం. అందరం 127 రోజులనుంచి రిలే నిరహార దీక్షలు చేస్తు న్నాం. బుధవారం ఉదయం అన్ని గ్రామల రైతులం కలిసి ధర్నాకు దిగాం. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రైతు జేఏసీని పిలిచి పరిశ్రమను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది పూర్తిగా రైతుల విజయం.
-రాజరెడ్డి, రైతు, దిలావర్పూర్.