భూపాలపల్లి, ఏప్రిల్ 25:భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గని ఆవరణ.. బీజేపీ అనుబంధ కార్మికసంఘం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా నిర్వహించిన సమావేశం. జనం అంతంతమాత్రంగా వచ్చిన సభలో తూతూ మంత్రంగా ప్రసంగించి వెళ్లిపోతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అదే గనిలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు కొమురయ్య కిషన్‌రెడ్డిని అడ్డుకున్నారు. లాభాల వాటాను రాష్ట్ర ప్రభుత్వమే పెంచి ఇస్తున్నది కదా.. మీరు ఎప్పుడైనా పెంచారా? అంటూ నిలదీశారు. అలాగే ఆదాయపన్ను ఎందుకు మాఫీ చేయరు అని కూడా కొమురయ్య అడిగారు. మంత్రి ఆ ధాటికి డంగైపోయి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
ఖాళీ కుర్చీలు షరా మామూలే
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నిర్వహించిన సమావేశం కార్మికులెవరూ పెద్దగా రాకపోవడంతో వెలవెలబోయింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎంఎస్ కేంద్ర కమిటీ నాయకుడు మాధవ్‌నాయక్ హాజరైన ఈ సమావేశానికి సింగరేణి కార్మికులు తక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ముందుగా సమావేశ మందిరానికి ఈటల రాజేందర్ చేరుకునే సమాయానికి అసలు కార్మికలే లేరు. దీంతో బీఎంఎస్ నాయకుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చినప్పటికీ బీఎంఎస్ నాయకులు ఆశించిన స్థాయిలో సమావేశానికి కార్మికులు రానేలేదు. ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. ఇవేమీ పట్టించుకొకుండా కిషన్‌రెడ్డి అసత్యాలు, అర్థసత్యాలతో ప్రసంగం వండివార్చారు.
బాలకార్మికులతో ‘బండి’కి డోలు
మక్తల్ టౌన్, ఏప్రిల్ 25: బండి సంజయ్ పాదయాత్రలో డోలు వాయించేందుకు ఎవరూ దొరకలేదేమో పాపం.. ఆ పార్టీ నేతలు బాల కార్మికులను పురమాయించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి పాదయాత్రగా వచ్చిన బండి సంజయ్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఊరేగింపులో పలువురు బాలలు డోలు వాయించారు. మరికొందరు బాలురు జెండాలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. రాజకీయ కార్యక్రమానికి బాల కార్మికులను ఉపయోగించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల తీరును పలువురు విమర్శించారు.