హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రాక్ గార్డెన్‌ను 8 వారాల్లోగా పునరుద్ధరించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను 3 నెలల్లోగా హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌లో 30.238 హెక్టార్లలో గల ప్రభుత్వ భూమిని రక్షించాలని, రాక్ గార్డెన్‌లోని ఆక్రమణలను తొలగించాలని కోరుతూ అడ్వకేట్ బీ సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ జరిపారు.
అక్కడ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకోవడంతోపాటు పలు చెట్లను కొట్టేసి, నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ వివరించారు. ఈ చర్యలు జీవో 99, 191లకు విరుద్ధమని పేర్కొన్నారు. రాక్ గార్డెన్లో ఆక్రమణలు తొలగించాలని గత నెల 21న హైడ్రాకు, జీహెచ్ఎంసీకి వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు చేపట్టలేదని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. సహజ సిద్ధమైన రాక్ గార్డెన్‌ను పరిరక్షించే బాధ్యత హైడ్రాదేనని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): వాటాల బదలాయింపునకు సంబంధించిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)తో వివాదంపై పయనీర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాటాల విక్రయ ఒప్పందాలను కొనసాగించరాదని రాకియా వాణిజ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండు కంపెనీల మధ్య ఏదైనా వివాదం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం లేకుండా సివిల్ కోర్టులో నేరుగా సూట్ వేయడానికి వీల్లేదని పయనీర్ అల్యూమినియం కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించి పిటిషన్‌ను కొట్టివేసింది.