హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో లోపాలపై ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన దళిత హకుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూలే, అంబేద్కర్ చూపిన మార్గంలో నేటి యువతన మనువాదంపై ఉద్యమించాలని సూచించారు. మే 20న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు డీహెచ్‌పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జాతీయసమితి సభ్యులు బోయిని అశోక్, పొన్నగంటి లావణ్య, రాష్ట్రవరింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, కే ఏసురత్నం, ఆఫీస్ బేరర్స్ సహదేవ్, రాజ్‌కుమార్, కుమారస్వామి, ఉషశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భగ్గుమన్న కాంగ్రెస్ వర్గపోరు ; రాజులకొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై ఘర్షణ
నెల్లికుదురు, మే 6 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భీం.. జై బాపు.. జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాపై ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఇందిరమ్మ కమిటీ ఏకపక్షంగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిందని, అనర్హులకు పెద్ద పీట వేశారని ఓ వర్గంవారు ఆరోపించారు. ఇందిరమ్మ కమిటీ వారి వర్గీయులకే ఎక్కువ ప్రాధన్యతనిచ్చిందని, పూర్తిగా ఇండ్లు లేని వారిని, మరోవర్గం వారిని విస్మరించిందని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.