నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 30 : ‘భూమికి హద్దులు చూపుతలేరు..కనీసం నన్ను చావనివ్వండి’ అంటూ నిర్మల్ కలెక్టరేట్‌కు ఓ రైతు డీజిల్ బాటిల్, పురుగులమందు డబ్బాతో రావడం కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన ముఖేశ్ తల్లి మంగలి రాజవ్వకు చెందిన భూమి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైంది. అప్పట్లో లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి కే శివారులో సర్వే నంబర్ 176లో 20 గుంటల భూమిని కేటాయించారు. ఈ భూమికి హద్దులు చూపెట్టాలని నాలుగు సంవత్సరాలుగా రాజవ్వతో పాటు ముఖేశ్ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా ముఖేశ్ డీజిల్ డబ్బా, లైటర్, పురుగులమందుసీసాతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
డీజిల్ వాసన రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. బ్యాగులను తనిఖీ చేసి డీజిల్ డబ్బా, పురుగుల మందు సీసాతో పాటు లైటర్‌ను లాక్కున్నారు. ‘సమస్యను పరిష్కరిస్త లేరు..కనీసం నన్ను చావనివ్వండి’ అంటూ ముఖేశ్ అక్కడే గట్టిగా అరవడంతో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ స్పందించి రైతును లోపలికి పిలిపించి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే రెండు మండలాల రెవెన్యూ అధికారులకు ఫోన్‌చేసి జనవరి 2 లోపు భూమి సరిహద్దులు చూపించి రైతుకు న్యాయం చేయాలని ఆదేశించారు.