చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 24 : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాలలో గురువారం చోటుచేసుకున్నది. సుద్దాలలో పంచాయతీ కార్యదర్శి కళ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఎంపికచేసిన జాబితా వివరాలను వెల్లడించారు. 615 మంది దరఖాస్తు చేసుకోగా 412 మందిని ఎంపిక చేసి ఆన్లైన్ చేశారు. ఇందులో ఇందిరమ్మ కమిటీ సభ్యులు 42 మంది లబ్ధిదారులను ఎంపికచేసినట్టు సెక్రటరీ తెలుపగా, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను పక్కనపెట్టి ఇండ్లు ఉన్న వారిని ఎలా ఎంపిక చేస్తారని మండిపడ్డారు. సుద్దాలలో దాదాపు 300 నిరుపేద కుటుంబాలుంటాయని, కేవలం 42 మందిని ఎలా ఎంపిక చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ఎంపీవో అజ్మత్ అలీని వివరణ కోరగా… ఇందిరమ్మ కమిటీ సభ్యుల సూచన మేరకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపికలు జరిగాయని తెలిపారు.