హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నిరుద్యోగుల ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. గల్లీలోని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఢిల్లీ కాంగ్రెస్‌కు తమ తడాఖా చూపేందుకు నిరుద్యోగులు ఢిల్లీ వెళ్లారు. రేవంత్ సర్కారు తీరును ఢిల్లీ వేదికగా ఎండగట్టేందుకు రాహుల్‌గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించనున్నారు.
నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్ నేతృత్వంలోని 30 మంది ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీకి చేరింది. జంతర్‌మంతర్‌లో ధర్నాకు అనుమతినివ్వాలని న్యూఢిల్లీ డీసీపీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించగా వీరిలో కొందరు రాహుల్‌గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.
జంతర్‌మంతర్‌లో ధర్నా, రాహుల్‌గాంధీ ఇంటి ముట్టడిని విజయవంతం చేయాలని జేఏసీ నేతలు కోరారు. ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతినిచ్చినట్టు మోతీలాల్‌నాయక్ తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి హటావో.. తెలంగాణ బచావో’ అనే నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీ దద్దరిల్లేలా ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. దశలవారీగా నిరుద్యోగులు ఢిల్లీకి వస్తారని, జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తారని, ఢిల్లీలో పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు.
రేవంత్ సర్కారు స్పందన లేకనే..
పరీక్షలు రాయనివారే దీక్షలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అవమానించడంతో ఆగ్రహించిన నిరుద్యోగులు శనివారం రాత్రి చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్‌లో తెల్లవారేదాకా నిరసన కొనసాగించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్‌గా మోతీలాల్‌నాయక్ గ్రూప్ -1, గ్రూప్ -4 హాల్‌టికెట్లను బహిర్గతం చేశారు. అశోక్‌నగర్‌లో పోలీసుల బందోబస్తు నేపథ్యంలో నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌ను వేదికగా చేసుకొని ఆదివారం రాత్రి మెట్రోపిల్లర్ల కింద ఆందోళన చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలని నిర్ణయించారు.