నాగర్‌కర్నూల్, అక్టోబర్ 18 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారు? వాటి నుంచి రైతులకు ఎప్పుడు నీరందిస్తారు? అని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరగా ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని, లేకుంటే డిసెంబర్ 7న నిరసన దీక్ష చేపడతానని నాగం హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్యాలెండర్ ప్రకారం 7వ తేదీలోపు పనులు పూర్తి చేసి కాల్వల ద్వారా నీటిని పారించాలని, లేదంటే తాను రిజర్వాయర్ వద్ద నిరసన దీక్ష చేపడుతానని స్పష్టంచేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక ఉందా లేదా అని ప్రశ్నించారు. రిజర్వాయర్లలో మోటర్లను బిగించడం పూర్తయినా కాల్వలకు నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తన హయాంలో ప్రారంభించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రస్తుతం రైతులకు వరంగా మారిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా రైతులు, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌గా ఎంపికైన ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ బృందం శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా, దళిత మేధావిగా, ఆర్థికవేత్తగా సమాజానికి అనేక సేవలందించిన పురుషోత్తంకు ఈ పదవి దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ మల్లేశ్, చిలకమర్తి గణేశ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.