కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. స్థానిక పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించి ఐదు గంటల పాటు అక్కడే ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకోగా సాయంత్రం 5 గంటలకు వదిలేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్, అధికారులకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలపాలని నిర్ణయించుకున్న మాజీ సర్పంచులు ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకోగా వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, మాజీ సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా సర్పంచులను పోలీసు వాహనాల్లో ఎక్కించి పీటీసీకి తరలించారు. ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి తెల్ల చొక్కా వేసుకుని వస్తే అతను కూడా సర్పంచేనని భావించిన పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. గుర్తింపు కార్డు చూపించిన తర్వాత వదిలేశారు. ఇలా రెండు గంటల పాటు కలెక్టరేట్ ఎదుట పోలీసులు హంగామా సృష్టించారు.
ఐదు గంటల పాటు నిర్బంధం
కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించి ఐదు గంటల పాటు నిర్బంధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన 40 మంది మాజీ సర్పంచులను మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉంచారు. భోజనం చేయలేదని, షుగర్ ఉన్నదని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని మాజీ సర్పంచులు వాపోయారు. మాజీ సర్పంచుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జోగు సాగర్, ప్రధాన కార్యదర్శి పంజాల జగన్ మోహన్‌గౌడ్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కరుణసాగర్తోపాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మాజీ సర్పంచులను నిర్బంధించిన పోలీసులు చివరికి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసన తెలిపేందుకు మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలోనే కలెక్టరేట్‌కు వచ్చినా అరెస్టు చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి రాకుండా ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేస్తాం
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని ప్రతి బహిరంగ సభలో చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చేశారని, అతన్నే టార్గెట్ చేసి ప్రజల్లోకి వెళ్తామని మాజీ సర్పంచుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. తమతోపాటు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం, మహాలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరిస్తామని మాజీ సర్పంచుల సంఘం నాయకులు పంజాల జగన్ మోహన్‌గౌడ్ స్పష్టం చేశారు.