ఆర్మూర్ టౌన్, జనవరి 29 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే దుష్ట తలంపుతో కాంగ్రెస్ సర్కార్ ఆ ర్మూర్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అ రాచకాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం ఆయన ఆర్మూర్‌లోని ఏసీపీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న నేతలకు పోలీసులు క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోగా, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం దారుణమని మండిపడ్డారు. పోలీసు శాఖ కాంగ్రెస్‌కు అనుబంధంగా మారిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఖద్దరు నేతలు, ఖాకీలు కలిసి అణచివేతకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లతో దోచుకుతింటూ ఆర్మూర్‌ను ఆగం చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై స్థానిక ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పోలీసుల తీరు మారకపోతే నిజామాబాద్‌లో ఎన్నికల కమిషన్ ఆఫీస్‌ను, ఆర్మూర్‌లో ఏసీపీ కార్యాలయాన్ని 10 వేల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు.