చేగుంట, మార్చి 16: సాగునీటి కోసం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇందుప్రియాల్ చౌరస్తా వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరురాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని మండలంలోని కసాన్పల్లి, పోతాన్పల్లి, మాచిన్సల్లి, పెద్దశివునూర్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. రైతుల రాస్తారోకోతో చేగుంట-గజ్వేల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. బోరు బావుల్లో నీళ్లు రావడం లేదని, ఏడు వందల ఫీట్లు బోరు తవ్వించినా నీళ్లు పడటం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా పొట్ట దశలో ఉన్న వేల ఎకరాల్లో వరి పంట పోతున్నదని ఆవేదన చెందారు. ఎండిన పంటలు పశువులకు మేతగా మారుతున్నట్టు వాపోయారు. కొండపోచమ్మ సాగర్ కాలువ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు. నీరివ్వకపోతే వంటావార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంటలో ఎండినపొలంలో దిగాలుగా ఉన్న రైతు పాయిలి శంకరయ్య
జనగామ మండలం పెంబర్తిలో నీళ్లులేక ఎండిపోయిన వరి పొలం