ధన్వాడ/కొల్లాపూర్, నవంబర్ 25 : పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ ఉన్నప్పుడు నెలనెలా సక్రమంగా పింఛన్ వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుంచి 20వ తేదీలోగా పోస్టాఫీస్‌లో డబ్బులు ఇచ్చేటోళ్లని, ఈ నెల 25వ తేదీ వచ్చినా ఇంకా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. రెండ్రోజుల్లో పింఛన్ వచ్చేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వృద్ధులు నిరసన వ్యక్తం చేశారు.