రాజోళి, జూన్ 3 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల పెద్ద ధన్వాడ శివారులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు దండయాత్ర చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం సోమవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలు, కొందరు ప్రైవేటు సిబ్బందిని దింపి పనులు చేయడంతో మంగళవారం ఉదయం గమనించిన రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే కంపెనీలకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూడు గంటలపాటు నిరసన తెలియజేసినా ఎవరూ స్పందించకపోవడంతో త్వరలోనే ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు.
అక్రమ నిర్మాణం అడ్డగింత ; మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే పీఏ బెదిరింపు కాల్
అమరచింత, జూన్ 3 : వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఓ వ్యక్తి పురపాలిక అనునుతి లేకుండా ఇంటి నిర్మాణ పనులు చేయడంతోపాటు డ్రైనేజీని సైతం ఆక్రమించుకోవడంతో మున్సిపల్ కమిషనర్ ఆ పనులు అడ్డుకోగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పీఏ వెంకటేశ్ ఫోన్ చేసి బెదిరించిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం .. మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో తోకలి శంకర్ మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీని సైతం కూల్చి అందులో పిల్లర్ వేసి పనులు చేపడుతుండడంతో గతంలోనే మున్సిపల్ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో పనులు నిలిపివేసిన యజమాని కూల్చివేసిన డ్రైనేజీపై మళ్లీ రెండు ఫీట్ల వరకు గోడ నిర్మించడంతో మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి వెళ్లి కాలనీవాసులకు ఇబ్బంది కలిగేలా ఉన్న నిర్మాణాన్ని ఆపాలని సూచించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పీఏ వెంకటేశ్ అక్కడే తనకు ఫోన్ చేసి ‘తమ అనుమతి లేకుండా అక్కడికి ఎందుకు వెళ్లావని, తక్షణమే అక్కడినుంచి వెళ్లకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో బెదిరించారని’ కమిషనర్ పేర్కొన్నారు.