నకిరేకల్, మార్చి 2 : నల్లగొండ జిల్లా నకిరేకల్, తిప్పర్తి మండలాల మధ్యలో డి-40 కాల్వ ఎల్-11 తూము వద్ద ఆదివారం ఆయా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచి నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మోదినిగూడెం, తిప్పర్తి మండలంలోని మామిడాల, ఇండ్లూరు, యాపలగూడెం, సర్వారం, గుర్రప్పగూడెం, మోత్కూరు, బుషిరెడ్డిగూడెం గ్రామాలకు వచ్చే సాగునీరు రాకుండా ఇరిగేషన్ అధికారులు గేటు అమర్చారని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు 500 మంది రైతులకు చెందిన 4 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని, పొట్టదశలో ఉన్న వరిపొలాలకు నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. గత ఏడాది వర్షాకాల సీజన్ నుంచి నీరు రాకుండా ఇతర ప్రాంతాలకు సాగునీరు తరలిస్తున్న విషయాన్ని ఇరిగేషన్ డీఈ, ఎస్ఈలకు అనేకమార్లు చెప్పినా పట్టించుకోకపోగా.. ఎల్-3 తూము వద్ద సాగునీరు రాకుండా మట్టి, ఇసుక బస్తాలు అడ్డుపెడుతున్నారని ఆరోపించారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నించగా ఎల్-11, ఎల్-3 తూములకు నీళ్లు వదలొద్దని ఆదేశాలున్నాయని, ఎల్-3 తూముకు వేసిన తాటిమొద్దులు గాని, మట్టి బస్తాలు తొలగిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఇదివరకు రోడ్డుపై రాస్తారోకో చేస్తే తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 25 మంది రైతులను 9 గంటలు నిర్బంధించినట్టు తెలిపారు. ‘నీళ్లు లేకపోతే పంటలు ఎట్ల పండుతయ్.. మేం ఎట్ల బతకాలి? పదేండ్ల కాలంలో ఏనాడూ తూములకు గేట్లు పెట్టలే.. వానకాలం నుంచి తూముకు గేటు వేయడం వల్ల 400 మంది రైతులం అల్లాడుతున్నం.. 4 వేల ఎకరాల్లో వేసిన వరి పంట పశువుల పాలవుతది.. పంట పొలాలకు సాగునీరందించి మా పంటలను కాపాడు తల్లీ’ అని వారు కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు.
డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచి తమ పొలాలకు సాగునీరు వచ్చే ఎల్-3 తూము వద్ద అధికారులు తాటిమొద్దులు, మట్టి బస్తాలు వేసిండ్రు. మా పొలాలకు నీళ్లు వదలాలని ఇటీవల నకిరేకల్-తిప్పర్తి రహదారిపై రాస్తారోకో చేస్తే అరెస్టు చేసి 9 గంటలు స్టేషన్లోనే నిర్బంధించిన్రు. నానమ్మ చావు, బతుకుల మధ్య ఉందని చెప్పినా కనికరించలేదు. నానమ్మ కాలం చేసిన ఐదోరోజు కార్యక్రమంలో ఉన్నా పోలీసులు దౌర్జన్యంగా పోలీస్టేషన్‌కు లాక్కెళ్లారు. పొట్ట దశకు వచ్చిన పొలాలకు నీళ్లు వదిలితేనే మా బతుకులు బాగుపడ్తయి.
ధర్పల్లి, మార్చి 2 : యాసంగి పంటలను కాపాడుకునేందుకు అన్నదాత నానా అవస్థలు పడుతున్నాడు. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. బోర్లు వట్టిపోవడంతో పంటను రక్షించుకోవడానికి నానా తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండ లం వాడి గ్రామానికి చెందిన రోండ్ల మధుసూదన్‌రెడ్డి తనకున్న మూడెకరాల్లో వరి పంట వేశాడు. చివరి తడులకు రాక ముం దే రెండెకరాల పంట ఎండిపోయింది. ఇంతవరకు బాగా పోసిన బోరు సైతం వట్టిపోవడంతో ఉన్న ఎకరం మేర పంటనైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో భగీరథ ప్ర యత్నం చేస్తున్నాడు. వాటర్ ట్యాంకర్‌ను అద్దెకు మాట్లాడుకుని పంటకు నీళ్లు అందిస్తున్నాడు. కనీసం అధికారులైనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు హెచ్చరికలు చేసి ఉంటే రైతులు యాసంగిలో పంట సాగు విస్తీర్ణం తగ్గించుకునేవారమని పలువురు రైతులు పేర్కొంటున్నారు.