రామన్నపేట, అక్టోబర్ 21: ప్రాణాలను పణంగా పెట్టి అయినా అంబుజా సిమెంట్ పరిశ్రమను అడ్డుకుంటామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనున్న అంబుజా సిమెంట్ కంపెనీ గేటు ఎదుట సోమవారం రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుమ్మక్కై చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్కు వందకోట్ల ఫండ్ ఇచ్చిన అదానీ, సీఎం స్కిల్‌కు ఎన్ని వందల కోట్లు ఇచ్చారోనని అనుమానం వ్యక్తం చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, సాగునీరు ఇచ్చి రైతులకు చేయూత అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. సిమెంట్ పరిశ్రమతో ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటును మానుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. 23న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, మాజీ ఎంపీపీ దయాకర్, కంభంపాటి శ్రీనివాస్, మాధవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.