లగచర్ల: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను (Industrial Corridor) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లగచర్ల, రోటిబండతండాలో అధికారులు భూసర్వే నిర్వహిస్తున్నారు. దీంతో రోటిబండతండాలో భూసర్వేకోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పారిశ్రామికవాడ కోసం భూములు ఇచ్చేదిలేదని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
లగచర్లకు చెందిన 102 సర్వే నంబర్లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండత తండాలో అదే 102 సర్వే నంబర్లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్లకుంట తండాలో 117. 120,121 సర్వే నంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40.15 గుంటలకు సంబంధించి భూసర్వే చేయనున్నట్టు దుద్యాల తహసీల్దార్ కిషన్ ఇప్పటికే వెల్లడించారు. లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలో మొత్తంగా 110 ఎకరాల అసైన్డ్ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించనున్నట్టు తెలిపారు.