సైదాపూర్, ఏప్రిల్ 27 : నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్కు చెందిన తాడవేణి భవాని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పొయ్యి వెలిగించి నిరసన తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో తనపేరు లేకపోవడంతో వంట సామగ్రి, మంచం, తదితర వస్తువులతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చింది. తనకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ జీపీ ఎదుట పొయ్యి పెట్టి వంట చేసింది. దీంతో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని, ఇల్లు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది.