పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 22: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో కాంగ్రెస్ నేతలకు చుక్కెదురైంది. ‘ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏ ఒక్క పని చేయని వ్యక్తివి, ఇప్పుడు మా ఊరికి ఎందుకు వచ్చావంటూ’ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావును గ్రామస్థులు అడ్డుకున్నారు. ‘గడపగడపకు కాంగ్రెస్’లో భాగంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు గురువారం రాత్రి గోపయ్యపల్లిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న క్రమంలో గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతా కలిసి ఒక్కసారిగా విజయరమణారావు వద్దకు వెళ్లి నిలదీశారు. ‘బీఆర్ఎస్ పాలనలోనే మేం సంతోషంగా ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఐదేండ్లు పనిచేసి, మా గ్రామానికి ఏం చేశారో చెప్పాలి. ఎమ్మెల్యే దాసరిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదంటూ’ ఆందోళనకు దిగారు. వెంటనే తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నాయకులు దాతు సదయ్య, మాజీ సర్పంచ్ నేరేళ్ల మొండయ్య, బోయిని ఓదెలుతోపాటు, గ్రామస్థులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్సై మహేందర్ యాదవ్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. అప్పటికే జరిగిన తోపులాటలో పలువురి చొక్కాలు చిరిగిపోయాయి. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు నేరేళ్ల స్వామి, ముత్యాల రాములు, కలవేన సమ్మయ్య, నేరేళ్ల శ్రావణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.