నిన్నటివరకు నిరంతర విద్యుత్తు వెలుగులతో దేశాన్నే నివ్వెరపరిచిన తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే కరెంటు వ్యవస్థచుట్టూ కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుదుత్పత్తి మందగించడం, తగినంత సరఫరా లేకపోవడం, కరెంటు కోతలు కాంగ్రెస్ వెయ్యిరోజులపాలన సాధించిన ఘనత! నిర్వహణ వైఫల్యాలు, అసంబద్ధ నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్‌కోతో ఆటలాడుతున్నది. మొన్న రైతుడిస్కమ్.. నిన్న స్మార్ట్‌మీటర్లు.. ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌కోను బలిపీఠమెక్కిస్తున్నది. రూ.68 వేల కోట్ల ఆస్తులున్న రాష్ట్ర విద్యుత్తు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్‌ను అమ్మేందుకు సిద్ధమైంది. అదీ కేవలం రూ.3500 కోట్ల కోసం 26శాతం వాటాల విక్రయానికి నిర్ణయించుకున్నది. ఈమేరకు పవర్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతిపాదించడంతో ఐపీవో దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రాన్స్‌కో ఆస్తుల మదింపు కోసం ప్రైస్‌వాటర్ కూపర్స్ సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిరయించుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ట్రాన్స్‌కో)ను అమ్మేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఆ సంస్థలోని 26 శాతం వాటాను విక్రయించేందుకు తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. దీంతో ట్రాన్స్‌కోలో ప్రభుత్వ వాటా 74 శాతానికి పడిపోతుంది. ఫలితంగా షేర్ మార్కెట్ లాభనష్టాలపై ఆధారపడి ఆ సంస్థ నడువాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాన్స్‌కో ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగని, భవిష్యత్తులో మరింత వాటాను విక్రయించి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రమాదం ఉన్నదని విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీజీ ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది. ఆ సంస్థకు దాదాపు రూ.68 వేల కోట్ల ఆస్తులున్నాయి. వాటా విక్రయం కోసం ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితి, నిధుల అవసరం, భవిష్యత్తు ప్రణాళికలు తదితర వివరాలతో ఓ నివేదికను రూపొందించి త్వరలో సెబీ అనుమతి కోరనున్నారు.
సెబీ నుంచి అనుమతి లభిస్తే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా ప్రజలకు షేర్లను విక్రయిస్తారు. ఐపీవో ప్రక్రియ పూర్తయ్యాక తొలుత నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో, ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో ట్రాన్స్‌కో షేర్లను లిస్ట్ చేస్తారు. వాటా విక్రయం, ఐపీవో ప్రక్రియ వ్యవహారాల్లో సలహాలు అందించేందుకు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థను కన్సల్టెంట్‌గా నియమించుకోవాలని పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. టీజీ ట్రాన్స్‌కో నెట్వర్క్ విస్తరణలో భాగంగా దాదాపు 30 ప్రాజెక్టుల పనులకు తెలంగాణ ఈఆర్సీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు రూ.3,500 కోట్ల మేరకు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. ఈ నిధుల సమీకరణ కోసమే ఐపీవోకు వెళ్తున్నట్టు ట్రాన్స్‌కో వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.